Daily Archives: June 28, 2013

Charmi Latest Half Saree Photos

రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ ‘బలుపు’ – మూవీ రివ్యూ

AW-BalupuNewPosters2706-17

మాస్ మహారాజా అంటూ తన అభిమానుల చేత పిలుపించుకొనే రవితేజ రెండేళ్ళ క్రితం విడుదల అయిన “మిరపకాయ్” సినిమా వరకూ మినిమం గ్యారంటీ హీరో. ఆ తరువాత రవితేజ కు కాలం కలిసి రాకపోవడంతో ఈ మినిమం గ్యారంటీ హీరో ఫెయిల్యూర్ గ్యారంటీ హీరోగా మారిపోయి డబల్ హ్యాట్రిక్ పరాజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. రవితేజ పని అయిపోయింది అని టాలీవుడ్ లో అందరూ అనుకుంటున్న సమయంలో తనకు ఒకప్పుడు “డాన్ శీను” సినిమాతో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకుడిగా పెట్టుకొని రవితేజ ‘డు ఆర్ డై’ అన్నట్లుగా తన కెరియర్ కు పరీక్షగా మార్చిన “బలుపు” సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బాడీ గార్డ్’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న గోపీచంద్ మలినేని ఒక పాత మాస్ కధను కొత్త స్క్రీన్ ప్లే లో ఇమిడ్చి, ఒక రవితేజ మార్క్ మసాలా మూవీ గా తయారు చేసి దానికి శ్రుతి హాసన్ అందాలని జోడించి చేసిన ప్రయత్నం ఎంత వరకు విజయవంతం అయింది..? ఇప్పటికైనా రవితేజ ను అదృష్ట లక్ష్మి వరించిందా..? అసలు ఈ సినిమా రవితేజ అభిమానులకు నచ్చుతుందా..? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ సినిమా కధలోకి వెళ్లదాం…

కథ :

రవి(రవితేజ) బ్యాంకులో పనిచేస్తూ తన తండ్రి మోహన్ రావు(ప్రకాష్ రాజ్) తో కలిసి బెంగుళూరులో నివసిస్తుంటాడు. ఒక రోజు తన ఫ్రెండ్ బొగ్గు శ్రీనివాస్(సత్యం రాజేష్) అందరినీ ఆటపట్టించే శృతి(శృతి హాసన్), క్రేజీ మోహన్(బ్రహ్మానందం) చేతిలో మోసపోయి సూసైడ్ చేసుకుంటాడు. అలా చేస్తున్న వాళ్ళకి బుద్ది చెప్పాలని రవి అనుకుంటాడు. అందులో భాగంగానే శృతిని ఆటపట్టిస్తుంటాడు. అది ఒక స్టేజ్ కి వచ్చేసరికి శృతి రవితో నిజంగానే ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే శృతికి మరో వారం రోజుల్లో రోహిత్(అడవి శేష్) పెళ్లి ఉంటుంది. కానీ ఈ విషయం తెలియడంతో శృతి తల్లి తండ్రులు రోహిత్ తో పెళ్లి కాన్సల్ చేసి రవితో నిశ్చితార్ధం జరిగే సమయంలో రోహిత్ మామయ్యా వైజాగ్ పూర్ణ(అసుతోష్ రాణ) ఎంటర్ అవుతాడు.

అప్పుడే సినిమాలో మెయిన్ ట్విస్ట్. పూర్ణ శృతిని తీసుకొని వైజాగ్ వెళ్ళిపోతూ రవిని వైజాగ్ రమ్మని చాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ రవి అలియాస్ శంకర్ – మోహన్ రావు అలియాస్ నానాజీ – వైజాగ్ పూర్ణ మధ్య పాత కక్ష్యలు ఉంటాయి. అసలు వీరి ముగ్గిరికి ఉన్న గొడవలేంటి? వీరి మధ్యలో డాక్టర్ అంజలి(అంజలి) ఎలా ప్రవేశించింది? రవితేజ – అంజలి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ తర్వాత అంజలికి ఏమైంది? చివరికి రవి శృతిని కాపాడి పెళ్లి చేసుకున్నాడా? లేదా అనేదే ఆసక్తికరమైన కథాంశాన్ని వెండితెరపైనే చూడాలి. స్పెషల్ రోల్ చేసిన లక్ష్మీ రాయ్ తన గ్లామర్ తో మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్ :

రవితేజకి బలుపు కమ్ బ్యాక్ మూవీ అని చెప్పాలి. ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జీతో ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ మాస్ పాత్రలో పవర్ఫుల్ పంచ్ డైలాగులు, నటన ఇరగదీశాడు. ఇక హీరోయిన్ పొడుగుకాళ్ల సుందరి శృతి హాసన్ విషయానికి వస్తే సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా కనిపించింది. అలాగే మొదటి సారి శృతి హై రేంజ్ లో అందాలు ఆరబోసి ప్రేక్షకుల మతి పోగొట్టిందని చెప్పాలి. అలాగే డాన్సులు కూడా బాగా చేసింది. ముఖ్యంగా ‘పాతికేళ్ళ సుందరి’ పాటలో మాస్ ప్రేక్షకులని డాన్సులతో విపరీతంగా ఆకట్టుకుంది. అంజలికి మరోసారి నటనకి ఆధారం ఉన్న పాత్ర దక్కింది. ఆ పాత్రకి అంజలి పర్ఫెక్ట్ గా సరిపోయింది మరియు పాత్రకి తనవంతు న్యాయం చేసింది.

సినిమాలో అందరికీ ఫుల్ కామెడీని పంచి ప్రేక్షకుల ముఖంలో నవ్వులు పూయించిన క్రీజీ మోహన్ అదే మన బ్రహ్మానందం నటన సూపర్బ్. ఈ సినిమాలో ఆయన తన కామెడీతోనే కాకుండా ‘గగ్నమ్ స్టైల్’, ‘ఐపిఎల్ జంపింగ్ జపాన్’ మ్యూజిక్ బిట్స్ కి స్టెప్పులేసి బాగా నవ్వించాడు. సినిమాలో చివరిగా ‘కనకనలాడే నిప్పు కణాన్ని.. కాకమీదున్న ఈ క్రేజీ ని ఏం చెయ్యలేరు’, ‘మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్’ అనే ఎమోషన్ డైలాగ్స్ ని బ్రహ్మానందం చెప్పడం విపరీతంగా నవ్వుతెప్పిస్తాయి. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఒకదానితో ఒకదానికి సంబంధం లేని రెండు విభిన్న పాత్రలను పోషించాడు. రెండు పాత్రలకి పూర్తి న్యాయం చేసాడు. అడవి శేష్, అసుతోష్ రాణాలు తమ పరిధిమేర నటించారు. ఇంటర్వెల్ బాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా కోసం ఎంచుకున్న మెయిన్ స్టొరీ లైన్ ఇప్పటికి మనం చాలా సినిమాల్లో చూసాం కాబట్టి కథా పరంగా చూసుకుంటే మీకు పెద్దగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో లాగేసినా సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త ఫ్లో తగ్గింది అలాగే కొన్ని సీన్స్ తో సినిమాని సాగదీశారని చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో రవితేజ సీరియస్ ఎమోషన్ కాస్త తగ్గిందనిపిస్తుంది, అక్కడ బ్రహ్మానందం కామెడీ లేకపోతే సినిమా చాలా వీక్ అయిపోయేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ – అసుతోష్ రానా మధ్య ఉండే వైరం గురించి చూపించే సీన్స్ ఇంకాస్త ఎక్కువ రేంజ్ లో ఉంటే బాగుండేది. రవితేజ – అంజలి రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. సినిమా క్లైమాక్స్ సాంగ్ బాగున్నప్పటికీ అది వచ్చి ప్లేస్ సరైనదిగా అనిపించలేదు. కమెడియన్ అలీని సరిగా ఉపయోగించుకోలేదు అందుకే ఆయన పాత్ర స్క్రీన్ పై పెద్దగా పేలలేదు. రావు రమేష్, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రీనివాస్ రెడ్డి, ఫిష్ వెంకట్ లాంటి వారిని సరిగా ఉపయోగించుకోలేదు.

సాంకేతిక విభాగం :

సినిమా కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లేని చాలా తెలివిగా రాసుకున్నారు అదే సినిమాని చాలా వరకూ కాపాడింది. అలాగే డైరెక్షన్ బాగుంది, నటీనటులనుండి బెస్ట్ పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నాడు. ఈ రెండు విభాగాల్లోనూ గోపీచంద్ మలినేని మంచి మార్కులు సంపాదించుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ పనితనం బాగుంది. కోనా వెంకట్ – వెలిగొండ శ్రీనివాస్ డైలాగ్స్ బాగున్నాయి. సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ లో గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. ఫైట్స్ చాలా వరకూ గాల్లోనే ఉన్నా సినిమాకి సరిపోయాయి కానీ నలుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేయడం వల్ల ఎవరు ఏ ఫైట్ కంపోజ్ చేసారో చెప్పడం కష్టం. థమన్ మ్యూజిక్ ఓకే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి టైటిల్ కి తగ్గట్టే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

ఇది టోటల్ గా రవితేజ మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్ కాబట్టి ఈ సినిమా గురించి పెద్దగా విశ్లేషించడానికి ఏమాత్రం ఉండదు. రవితేజ స్టార్ డమ్ ను ఎలివేట్ చేసే పక్కా మాస్ సినిమా ఇది. కాని ఈపాటి మాస్ సినిమాలు కూడా చాలామంది రవితేజ ను పెట్టుకొని ఈమధ్య కాలంలో తియ్యలేకపోయారు. ఆలోటు ను గోపీచంద్ మలినేని పుడ్చాడు. రవితేజ పై ఏది బాగా వర్క్ అవుట్ అవుతుందో అంతవరకే చూపెట్టాడు దర్శకుడు. అందువల్ల సినిమాలో ఎక్కడా అతి అనిపించదు. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడు కోవాలి అంటే ఈ సినిమా కధకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఇక్కడే వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం దర్శకుడు పూర్తిగా పట్టు తప్పాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నింటిలోనూ ఇమోషన్, ఎంటర్తైన్మెంట్ లేకుండా సాదాసీదాగా నడిపించేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు కొద్దిగా శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా రవితేజ కోరుకొనే మెగా హిట్ ఇచ్చి ఉండేది. చివరగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇది తప్పక చూడవలసిన సినిమా మాత్రం చెప్పలేం. అలాగని ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు తాను ఈ సినిమాకు ఎందుకు వచ్చానా అని బుర్ర బాదుకొని వేల్లిపోడు. అయితే మాత్రం ఒకసారి వచ్చిన ప్రేక్షకుడు మరోసారి మాత్రం ఈ సినిమాకి రావడం కష్టం. మరీ రవితేజ వీరాభిమాని అయితే తప్ప. చివరగా ఒకేఒక్క మాటలో చెప్పాలి అంటే ఈమధ్య కాలంలో విడుదల అయిన రవితేజ సినిమాలలో బెటర్ మూవీ ‘బలుపు’.

readandhra.com రేటింగ్: 3/5